రారే మన యేసు స్వామిని
జూతము కోర్కె - లూర ప్రియులారా పేర్మిని
గూరిమి భక్తుల జేరువ విందట
భూరిద యామృత సారము లొలికెడు
చారు కటాక్ష వి - శాలేక్షనుడట
నారకులగు నర - నారీ జనులకు
దారక మొసగను దానే పిలుచునట
దారుణ పాప మ-హారణ్యమునకు
గారు చిచ్చు గతి గన్పడువాడట
ఘోర దరిద్రత గూల్చెడి వాడట
సారంబగు తన సభకు మకుటమాట
||రారే||
పతిత పావనమౌ వేల్పట
అనాది దేవ సుతుడై - ఇల జేరినాడట
సతతము కడు దురి - తతమోయుతమగు
ప్రతి దేశమునకు - హిత భాస్కరుడట
అతులిత మోక్షో - న్నత గుణగణుడట
కుతలంబున స-ద్గతి రహితంబగు
పతితుల గావను - మృతుడైనాడట
అతి పుణ్య తను - క్షత శోణితమును
వ్రతముగ సిలువను నతఁడొసంగెనట
మృతిని జయించుచు బ్రతికి లేచెనట
మతి నమ్మిన మన గతి యితడేనట
||రారే||
తుదలేని మహిమ వాడట
తను గొల్చు సాధు - హృదయుల సొమ్ము మూటట
చెదరిన గొర్రెల - వెదక వచ్చెనట
చిదురుపలగు జన హృదయములన్నిట
బదిలముగా నె-మ్మది నిడువాడట
నదితట మఠ జన వదనముల స
మ్మద శుభవార్తను - బలికినవాడట
సదయత సంధుల - కక్షుల నిడెనట
వెదకి బధిరులకు - వీనులొసగె నట
సదమల మోక్ష ప్రభుడగు విభుడట
యిదిగో మనకిత డేలినవాడట
||రారే||
