దేవుని ప్రేమ ఇదిగో - జనులార - భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన - పరలోక - జీవంబు మనకబ్బును
||దేవుని||
సర్వలోకము మనలను - తన వాక్య - సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండే - మన మీద - జాలిపరుడై యుండెను
||దేవుని||
మానవుల రక్షింపను - దేవుండు - తన కుమారుని బంపెను
మన శరీరము దాల్చెను - ఆ ప్రభువు - మన పాపమునకు దూరుడే
||దేవుని||
యేసు క్రీస్తను పేరున - రక్షకుడు - వెలసి నాడిలలోపల
దోసకారి జనులతో - నెంతో సు - భాషలను బల్కినాడు
||దేవుని||
పాప భారంబు తోడ - నే ప్రొద్దు - ప్రయాసముల బొందెడి
పాపులందరు నమ్మిన - విశ్రాంతి - పరిపూర్ణమిత్తు ననెను
||దేవుని||
సతులైన పురుషులైనన్ - యా కర్త - సర్వ జనుల యెడలను
సత్ప్రేమగా నడిచెను - పరలోక - సద్బోధలిక జేసెను
||దేవుని||
చావు నొందిన కొందరిన్ - యేసుండు - చక్కగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు - ప్రభు నంటి - స్వస్థంబు తా మొందిరి
||దేవుని||
గాలి సంద్రపు పొంగులన్ - సద్దణిపి - నీళ్లపై నడచినాడే
మేలు గల యద్భుతములు - ఈలాగు - వేల కొలదిగ జేసెను
||దేవుని||
చేతుల కాళ్లలోను - రా రాజు - చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినారే - పరిశుద్ధ - నీతి తా మోర్వలేకన్
||దేవుని||
ఒడలు రక్తము గారగ - దెబ్బలు - చెడుగు లందరు గొట్టిరి
వడిముళ్లు తల మీదను - బెట్టిరి - ఓర్చెనో రక్షకుండు
||దేవుని||
ఇన్ని బాధలు బెట్టుచు - దను జంపు - చున్న పాప నరులను
మన్నించు మని తండ్రిని - యేసుండు - సన్నుతితో వేడెను
||దేవుని||
రక్షకుడు శ్రమ బొందగా - దేశంబు - తక్షణము చీకటయ్యెన్
రక్షకుడు మృతి నొందగ - తెర చినిగి - రాతి కొండలు పగిలెను
||దేవుని||
రాతి సమాధిలోను - రక్షకుని - నీతిగల దేహంబును
పాతి పెట్టిరి భక్తులు - నమ్మిన - నాతు లందరు జూడగా
||దేవుని||
మూడవ దినమందున - యేసుండు - మృతి గెల్చి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు - చూచిరి - నలువది దినములందున్
||దేవుని||
పదునొకండు మారులు - వారలకు - బ్రత్యక్షు డాయె నేసు
పరలోకమున కేగెను - తన వార్త - బ్రకటించు మని పల్కెను
||దేవుని||
నమ్మి బాప్తిస్మమొందు - నరులకు - రక్షణ మరి కల్గును
నమ్మ నొల్లక పోయెడు - నరులకు - నరకంబు సిద్ధమనెను
||దేవుని||
